Online Puja Services

నాయనార్ల గాథలు - మురుగ నాయనారు

3.144.230.82

నాయనార్ల గాథలు - మురుగ నాయనారు | Nayanar Stories - Muruga Nayanar
లక్ష్మీ రమణ 

పూలు అందమే! కానీ పూలలో దాగున్న మనసెంతో అద్భుతం కదా ! ఈశ్వరుడు అటువంటి భక్తి కుసుమాల చుట్టూ తిరిగే తుమ్మెద లాంటివాడు.  మనసు కుసుమంలో దాగిన భక్తి మకరందము తప్ప మరొకటి ఆశించనివాడు.  అందుకే భక్తితో గుచ్చిన కేవల పూల మాలలు ఆ భగవంతునికి దగ్గర చేస్తాయి.  సందేహమే లేదు . ఆ విధంగానే కదా చక్కని చుక్క గోదామాత చిక్కని పూల దండలల్లి ఆ చక్కని, చిక్కని చక్కనోడు రంగనాథుని చిక్కించుకుంది.  ఆళ్వారులలో చోటు దక్కించుకుంది. 

 హరికి , హరునికి తేడా ఉందనుకుంటే, అది మన అజ్ఞానం తప్ప మరొకటికాదు.  శివశ్య హృదయం విష్ణుః ; విష్ణుశ్య హృదయం శివః అన్నారు కదా పెద్దలు . స్వరూపాలుగా వేరైనా, మనసులు ఒక్కటే కదా ! ఆ మాటకొస్తే, ఈశ్వరుడు ఒక్కడే! ఆయన భక్తులు కూడా అదే విధంగా ఒకే  దారిలో పయనించి ఈశ్వర కృపకి పాత్రులయ్యారు.  విష్ణుభక్తులైన ఆళ్వారుల్లో ఆ గోదామాత లాగా,  ఈశ్వర భక్తులైన నాయనార్లలో ఆ పరమేశ్వరుణ్ణి చేరుకున్న నాయనారు మురుగ నాయనారు.

 చరితంతా పూల పరిమళాలతో గుబాళింపజేసి , తన ప్రాణసుమాన్ని పరమాత్మకు సమర్పించిన నాయనారు కథ ఆద్యంతమూ అమృత మకరంద రసాన్వితము. మురుగ అనే పదానికి సౌందర్యము అని అర్థం. ఆ ఈశ్వరుని కుమారుడు కుమారస్వామిని తమిళులు ఈ పేరుతోనే ఆరాధిస్తారు.  శివపార్వతుల సౌందర్యాన్ని కలబోసుకొని , రాశీభూతమైన సౌందర్యంగా ఆవిర్భవించినవాడు కార్తికేయుడు. అందుకే ఆయన మురుగన్ అయ్యారు . 

పరమేశ్వరి పరమ ప్రకృతీ స్వరూపం. ఆమె తన సృజనలో కుసుమంగా పరిణమించిందేమో ! అందుకే సృష్టిలో పుష్పాల కన్నా సౌందర్యభరితమైనవి మరేమీ లేవనిపిస్తుంది. అవి విరిసినప్పుడు   పరవశించిన ప్రకృతికి ప్రతిరూపంలా అనిపిస్తాయి కదూ ! అందుకే కాబోలు  పరమాత్మకి ఆ పూలంటే అంతటి ఇష్టం.  వాటితో అర్చిస్తే చాలు కోరినవన్నీ అనుగ్రహిస్తారు. అయినా … ప్రకృతీ స్వరూపమైన అమ్మ కన్నా, అయ్యవారికి ప్రియమైనది లేదుగా! ఈ సూత్రం బాగా వంట బట్టించుకున్నవారు మురుగనాయనారు.  

మురుగనాయనారు చోళనాడులోని పంపుకలూర్ (తిరుపుకలూరు) లో జన్మించారు .  ఆయన గొప్ప శివభక్తుడు. సూర్యోదయం కాకముందే అనుష్ఠానాన్ని పూర్తి చేసుకొని శివపూజకు విరిసిన పూలని సేకరించి తెచ్చేవారు.  శివారాధనకి శివునికి ఇష్టమైన పూలని, అందమైన పూలని సేకరించేందుకు ఎంత దూరమైనా వెళ్లేవారు .  కొండలు, కోనలు, అడవులు, సెలయేళ్ళు  తిరిగి ఈశ్వరార్చనకి అవసరమైన పూలని సేకరించేవారు. ఆ పూవులతో అందమైన మాలలల్లి పరమేశ్వరుణ్ణి అలంకరించేవారు. ఆ పూల సొగసుల్లో తన మనసుని, వాటి దివ్య పరిమళాల్లో తన భక్తిని నింపి, దివ్య ఆధ్యాత్మిక మకరందంతో నిండిన మాలలుగా చేసి ఆ పరమాత్మునికి అర్పించేవారు.  

మురగనాయనారు ఆరాధించిన ఆ ఆదిదంపతులు  వర్థమానేశ్వరుడు, మనోన్మణి పేరిట తిరుపుకలూరులో  పూజలందుకుంటున్నారు.  ఈ ఆలయాన్ని నాయనారు జ్ఞానసంబందార్ దర్శించారు.  అక్కడే ఆయనకి అసమానమైన భక్తి తత్పరతతో ఈశ్వరారాధన చేస్తున్న మురుగ నాయనారు పరిచయమయ్యారు. స్వయంగా ఈశ్వరుని కుమార స్వరూపంగా పేరొందిన జ్ఞానసంబందార్, మురుగ నాయనారు భక్తిని ప్రపంచానికి చాటేలా తన కీర్తనలలో పేర్కొన్నారు. ఈశ్వరునిపట్ల మురుగ నాయనారుకున్న గాఢమైన భక్తి ఈ కీర్తనలలో వెల్లడవుతుంటుంది.  మురుగనాయనారు కూడా తిరు జ్ఞానసంబందారు వివాహానికి హాయారైనవారిలో ఉన్నారు.  వారందరితో కూడా కలిసి జ్ఞానసంబందారు వివాహసందర్భంలో, తిరునల్లూరులో ఉద్భవించిన మహా జ్యోతిలో ప్రవేశించి ఈశ్వరునిలో  లయమయ్యారు.

 పూలు సేకరించడం, వాటితో పూలమాలలల్లి ఈశ్వరుణ్ణి అలంకరించడం- చూడండి  ఇది ఎంతటి తేలికైన సేవో …! ఈ సేవకు కూడా పరవశించి పోయాడా ఈశ్వరుడు. భోళాశంకరుని కృప హద్దులు లేని, ఎల్లలులేని మహా సంద్రం.  దూకే గంగాజలం.  ఆ స్వామిని మనసారా పిలిస్తే చాలు, ఓయని పలికే కరుణా సముద్రుడు.  అనంతమైన అనుగ్రం అనే తన బలమైన అలలతో మనల్ని అనుగ్రహించాలని ఆ ఆదిదంపతుల దివ్య చరణాలకు ప్రణమిల్లుతూ శలవు.  

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్య చరణారవిందార్పణమస్తు!! శుభం . 

 

 

Nayanar, Stories, Muruga, 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi